తెలంగాణకు కేసీఆర్ గుడ్ బై – వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే బరిలోకి..?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ లోక సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాకుండా మహారాష్ట్రలోని లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారా..? ఇందుకు సంబంధించిన కార్యాచరణ రెడీ అవుతుందా..? తెలంగాణను వీడి పక్క రాష్ట్రం నుంచి పోటీ చేయడం వలన బీఆర్ఎస్ వైపు దేశ ప్రజల దృష్టి కేంద్రీకృతం అవుతుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారా ..? అంటే అవుననే అంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు.

Advertisement

బీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా తీర్చిదిద్దడంలో భాగంగా కేసీఆర్ సంచలనాలకు తెరతీయబోతున్నారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన మాహారాష్ట్ర లోక్ సభ నియోజకవర్గం నాందేడ్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి కేసీఆర్ బరిలో నిలవడం ద్వారా బీఆర్ఎస్ కు ఎలాంటి మైలేజ్ లభిస్తుంది..? గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి..? బీఆర్ఎస్ పట్ల అక్కడి ప్రజలు అభిప్రాయం ఎలా ఉందనే అంశాలను బేరీజు వేసుకొని నాందేడ్ నుంచి పోటీపై ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక స్థాయిలోనైతే బీఆర్ఎస్ నేతల ప్రతిపాదనకు కేసీఆర్ అంగీకారం తెలిపారని… పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుందామని అన్నట్లు సమాచారం.

Advertisement

అయితే… నాందేడ్ నుంచి పోటీ చేయడం కుదరకపోతే ఔరంగాబాద్ లోక్ సభ స్థానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పార్లమెంట్ స్థానం నుంచి మజ్లిస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తోంది. తెలంగాణలో ఎలాగు బీఆర్ఎస్ , మజ్లిస్ పార్టీలు మిత్రపక్షాలుగానే ఉన్నాయి. కాబట్టి, ఔరంగాబాద్ లో పోటీకి కేసీఆర్ మొగ్గు చూపితే అందుకు ఎంఐఎం సంపూర్ణ సహకారం అందించే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఇలా ఔరంగాబాద్ నుంచి పోటీ చేయడం ద్వారా విజయం ఈజీ అవుతుందని పార్టీ నేతలు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

మహారాష్ట్ర నుంచి కేసీఆర్ పోటీ చేయడం వలన మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణకు మార్గం ఏర్పడటంతోపాటు దేశ ప్రజల చూపు బీఆర్ఎస్ పై పడే అవకాశం ఉందని లెక్కలు వేసుకుంటున్నారు. నాందేడ్, ఔరంగాబాద్… ఈ రెండు లోక్ సభ స్థానాల్లో ఎదో ఒక దాని నుంచి పోటీ చేసి గెలుపొందితే దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ కు సానుకూల పవనాలు వీస్తాయని అంచనా వేస్తున్నారు. ఇందుకు కేసీఆర్ కూడా సానుకూలంగా ఉన్నారని అందుకే మహారాష్ట్రలో వరుసగా సభలు ఏర్పాటు చేసి ప్రజలు చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement