World Cup 2023 : వన్డే ప్రపంచ కప్ లో భాగంగా జరిగిన సెమీ ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించి ఫైనల్స్ కి చేరుకుంది. ఈ మ్యాచ్ లో 398 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. దీంతో టీం ఇండియా 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ 39 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే మిచెల్, విలియమ్సన్ రాణించడంతో టీమిండియా కి టెన్షన్ పుట్టింది.
కానీ మహమ్మద్ షఫీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఏకంగా ఏడు వికెట్లు సాధించి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించారు. టాస్ గెలిచిన టీమ్ ఇండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ వన్డే కెరీర్లో 50వ సెంచరీ చేసి రికార్డ్స్ బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్లో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ మరోసారి అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. జట్టు స్కోరు 71 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఔట్ అయ్యారు. ఆ తర్వాత విరాట్ తో కలిసి గిల్ అద్భుతంగా ఆడారు. అయితే వ్యక్తిగత స్కోర్ 80 పరుగుల వద్ద కాలి కండరాలు పట్టేయడంతో అనూహ్యంగా రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరగాల్సి వచ్చింది.
ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ వరుసగా రెండవ శతకాన్ని నమోదు చేశారు. కేవలం 70 బంతుల్లో 105 పరుగులు చేసి అవుట్ అయ్యారు. అయ్యర్ ఇన్నింగ్స్ లో ఎనిమిది సిక్సర్లు, నాలుగు ఫోర్లు కొట్టారు. రోహిత్ శర్మ 47, శుభన్ మన్ గిల్ 80 , విరాట్ కోహ్లీ 117 , శ్రేయస్ అయ్యర్ 105, కేఎల్ రాహుల్ 39,సూర్య కుమార్ యాదవ్ 1 చొప్పున పురుగులు చేసి టీమిండియా గెలుపుకి కారణమయ్యారు. ఇక ఫైనల్స్ నవంబర్ 19న అహ్మదాబాద్ లో జరగనుంది. ఈసారైనా టీమిండియా వరల్డ్ కప్ కొట్టాలని దేశమంతా ఎదురుచూస్తుంది.