Tirupati : ఈ సంవత్సరంలో రెండు చంద్రగ్రహణాలు ఆవిర్భవించగా చివరిదైన చంద్రగ్రహణం ఈనెల 29న ఏర్పడబోతోంది. ఇక దీని ప్రభావం మన దేశం పైన కూడా చూపనున్నట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారు. అయితే హిందూ శాస్త్రం ప్రకారం పాక్షిక చంద్రగ్రహణాన్ని సూతక కాలంగా భావిస్తారు. ఇక ఈ సూతక కాలంలో ఎవరు ఎలాంటి పనులు చేయరు. ఈ సమయంలో ఏవైనా శుభకార్యాలు చేసినట్లయితే వాటిని పాపంగా పరిగణిస్తారు. అంతేకాక పూజలు నిర్వహించకుండా పూజ గదిని సైతం మూసివేస్తారు.ఈ నేపథ్యంలోనే పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనున్న కారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానం ను దాదాపు 8 గంటల పాటు మూసి వేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలియజేశారు. ఈ క్రమంలో అక్టోబర్ 28 రాత్రి శ్రీవారి ఆలయాన్ని మూసివేసి గ్రహణం వీడిన అనంతరం అక్టోబర్ 29న ఆలయానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తిరిగి తెరవనున్నారు.
అయితే ఈ నెల 29వ తేదీ తెల్లవారుజామున 1: 05 నుండి 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. దీంతో అక్టోబర్ 28 రాత్రి 7:05 నిమిషాలకు స్వామివారికి సంబంధించిన అన్ని దర్శనాలను నిలిపివేస్తారు. ఆరోజు రాత్రి ఆలయ తలుపులు మూసివేసి తిరిగి గ్రహణం విడిచిన అనంతరం అక్టోబర్ 29 తెల్లవారుజామున 3:15 నిమిషాలకు సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి , స్వామి వారి ఆలయ ఏకాంత శుద్ధి, సుప్రభాత సేవ, అనంతరం తలుపులు తెరుస్తారు. ఈ క్రమంలో దాదాపు 8 గంటల పాటు ఆలయ తలుపులు మూసి వేయబడతాయి. కావున ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీవారి భక్తులు వారి ప్రయాణాలను వాటికి అనుగుణంగా మార్చుకోవాల్సిందిగా టిడిపి అధికారులు కోరుతున్నారు.