Naresh : తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే అది నటుడు నరేష్ కు సంబంధించిన విషయమే. ఆయన ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొని.. వాళ్లకు విడాకులు ఇచ్చి నాలుగో పెళ్లికి కూడా రెడీ అయిపోయాడు. దీంతో అందరి చూపు నరేష్ పై పడింది. అసలు నరేష్ కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి అనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడు నాలుగో పెళ్లి ఏంటి.. అది కూడా పవిత్ర అనే మరో సీనియర్ నటితో అనేసరికి తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఆయన అసలు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారా? మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది? వాళ్లతో ఎందుకు విడిపోయాడు అనే విషయం గురించి నెట్టింట్లో తెలుగు ప్రేక్షకులు తెగ సెర్చ్ చేస్తున్నారు. నరేష్ విజయనిర్మల కొడుకు అనే విషయం అందరికీ తెలిసిందే. తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చి.. సూపర్ స్టార్ కృష్ణను విజయనిర్మల పెళ్లి చేసుకుంది.
Naresh : నాలుగు స్తంభాలాట సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నరేష్
సూపర్ స్టార్ కృష్ణ కూడా నరేష్ ను తన సొంత కొడుకుగానే చూసుకున్నాడు. విజయనిర్మల బతికి ఉన్నంత వరకు నరేష్ జీవితం బాగానే ఉంది. ఆమె చనిపోయాక నరేష్ కు కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఇండస్ట్రీలో నాలుగు స్తంభాలాట సినిమాతో అడుగు పెట్టాడు నరేష్.

నరేష్ తన మొదటి పెళ్లిని విజయనిర్మల చూసిన సంబంధానే చేసుకున్నాడు. సీనియర్ డ్యాన్స్ మాస్టర్ శ్రీను కూతురును నరేష్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు నవీన్ విజయ్ కృష్ణ అనే కొడుకు ఉన్నాడు. అతడు కూడా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాడు. పలు సినిమాల్లో హీరోగానూ నటించాడు.
అయితే..తన మొదటి భార్యతో మనస్పర్థలు రావడంతో తనకు నరేష్ విడాకులు ఇచ్చి ప్రముఖ కవి , సినిమా పాటల రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖ సుప్రియను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు తేజ అనే కొడుకు ఉన్నాడు. ఆ తర్వాత ఇద్దరికీ మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు.

ఆ తర్వాత మూడో పెళ్లి చేసుకున్నాడు నరేష్. తనకంటే 20 ఏళ్లు చిన్నదైన రమ్యను నరేష్ పెళ్లి చేసుకున్నాడు. అది కూడా తనకు 50 ఏళ్లు దాటిన తర్వాత చేసుకున్న పెళ్లి. రమ్య ఎవరో కాదు.. ఏపీ మాజీ మంత్రి రఘువీరా రెడ్డి సోదరుడి కుమార్తె. వీళ్లకు కూడా ఒక కొడుకు ఉన్నాడు. కానీ.. ఇద్దరికీ మనస్పర్థలు రావడంతో గత 8 ఏళ్ల నుంచి వేర్వేరుగా ఉంటున్నారు.

ప్రస్తుతం నరేష్.. పవిత్రా లోకేశ్ ను పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో నరేష్ నాలుగో పెళ్లి గురించి చర్చనీయాంశం అయింది. పవిత్రా లోకేశ్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడని తెలుసుకొని నరేశ్ ను నిలదీసేందుకు మైసూర్ వెళ్లిన రమ్య.. అక్కడ హోటల్ లో ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.