జబర్దస్త్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్న నటులలో ఒకరు పంచ్ ప్రసాద్. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగా క్షీణించినట్లుగా కనిపిస్తుంది. కనీసం నిల్చునే పరిస్థితిలో కూడా లేనట్లుగా ఉంది. ఆయన గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఆయనకున్న కిడ్నీ సమస్య కారణంగా ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. అతి త్వరలో ఆపరేషన్ చేయాలని వైద్యులు చెబుతున్నారు. అయితే ఆపరేషన్ కి లక్షలు ఖర్చు అవుతుంది. దీంతో ఆయన తోటి నటుడు జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ సోషల్ మీడియాలో ప్రసాద్ హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉందని పోస్ట్ చేశారు. అన్నకు చాలా సీరియస్ గా ఉంది. డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పారు. దానికి చాలా ఖర్చు అవుతుంది.
మేమంతా ప్రయత్నిస్తున్నాం మీరు కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాను అని పోస్ట్ చేశారు. ఆ పోస్టులో ప్రసాద్ భార్య సునీత అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. దాతల నుంచి సహాయం కోరుతూ ఈ పోస్ట్ చేశారు. కిడ్నీ సమస్యల కారణంగా ప్రసాద్ కు మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. నవంబర్లో ఆయనకు బాగా సీరియస్ అయింది. ప్రస్తుతం ఆ సమస్య మళ్లీ తిరగబెట్టడంతో ఏకంగా నడవలేని స్థితికి చేరుకున్నారు. షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళిన ప్రసాద్ జ్వరంతోపాటు నడవలేక బాధపడడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పుడు పరీక్షలు చేసి కిడ్నీ సమస్య మరింత ఎక్కువైందని డాక్టర్స్ చెప్పారు.
నడుము వెనకవైపు బాగా చీము పట్టిందని వెల్లడించారు. దీనికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉంది. అంతకుముందు ఆపరేషన్ జరిగింది. అప్పుడు కోలుకొని టీవీ షూటింగ్ కూడా చేశారు. ఈమధ్య టీవీ ప్రోగ్రాంలో ఆయన కనిపించారు. మళ్లీ ఆరోగ్య సమస్యలు తిరగబెట్టినట్లు తెలుస్తోంది. గతంలో ప్రసాద్ చికిత్స కోసం జబర్దస్త్ కమెడియన్లతో పాటు పలువురు దాతలు సహాయం చేశారు. అప్పట్లో వారందరికీ ప్రసాద్ కృతజ్ఞతలు చెప్పారు. ఆయన మళ్ళీ కోలుకొని టీవీ షోలు చేయడం పట్ల ప్రేక్షకులు సైతం సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈసారి కూడా ఆపరేషన్ కి ఖర్చు ఎక్కువ అవుతుందని, దాతల నుంచి సహాయం కోరుతూ ఇమాన్యుయెల్ పోస్ట్ చేశాడు.