Super Star Krishna Last Rites : సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం ముగిశాయి. నిన్న ఉదయం 4 గంటలకు కృష్ణ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. నిజానికి.. నిన్న సాయంత్రమే కృష్ణ అంత్యక్రియలు జరగాల్సి ఉన్నా.. ఆయన్ను అభిమానుల సందర్శనార్థం చూపించడం కోసం అంత్యక్రియలను ఇవాళ్టికి వాయిదా వేశారు. రాత్రి గచ్చిబౌలి స్టేడియంలో ఆయన పార్థీవ దేహాన్ని ఉంచి అభిమానులు సందర్శించేలా ఏర్పాటు చేయాలనుకున్నా రాత్రి చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరికీ ఇబ్బంది కలుగుతుందని భావించి ఉదయమే పద్మాలయ స్టూడియోకు ఆయన భౌతికకాయాన్ని తరలించి అక్కడే మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనార్థం ఉంచారు.

ఆ తర్వాత అక్కడి నుంచి సూపర్ స్టార్ కృష్ణ అంతిమ యాత్ర జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి ప్రారంభం అయింది. మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య జరిగాయి. సూపర్ స్టార్ కృష్ణకు మహేశ్ బాబు తలకొరివి పెట్టారు. అంత్యక్రియల సమయంలో తెలంగాణ ప్రభుత్వం.. కృష్ణకు అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించింది. పోలీసులు గాల్లో తుపాకులు పేల్చి ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.
Super Star Krishna Last Rites : పద్మాలయా స్టూడియో నుంచి మహాప్రస్థానానికి చేరుకున్న అంతిమయాత్ర
పద్మాలయా స్టూడియో నుంచి ప్రారంభమైన అంతిమ యాత్రలో కృష్ణ అభిమానులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. ఆయనకు కడసారి వీడ్కోలు పలికేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. లక్షలాది మంది అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల మధ్య కృష్ణ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. తన కొడుకు మహేశ్ బాబు తన తండ్రి కృష్ణకు తలకొరివి పెట్టారు.