వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమంటూ ప్రచారం జరుగుతోన్న వేళ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు అవినాష్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వివేకా క్యారెక్టర్ కు మకిలి అంటించే ప్రయత్నం చేస్తున్నారు. వివేకా కేసు నిందితుడిగానున్న సునీల్ యాదవ్ తల్లిని లైంగికంగా వేధించడంతోనే వివేకాను సునీల్ యాదవ్ హత్య చేశాడని ఆరోపించిన అవినాష్ రెడ్డి ఇప్పుడు కొత్త ఆరోపణలు చేశారు.
వివేకా కేసులో తనను అరెస్ట్ చేయకుండా సీబీఐని ఆదేశించాలని దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ లో సంచలన ఆరోపణలు చేశారు అవినాష్ రెడ్డి. మహిళలతో వివేకాకున్న వివాహేతర సంబంధాలే ఈ హత్యకు దారి తీసి ఉంటాయని పేర్కొన్నారు. ఇదివరకు ఓ ముస్లిం మహిళతో సంబంధం..వారి కొడుకునే రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని వివేకా చెప్పారని… ఇదంతా మనస్సులో పెట్టుకొని ఆస్తి తగాదాలతోనే వివేకాను అతని అల్లుడు హత్య చేసి ఉంటాడని ఆరోపించాడు అవినాష్ రెడ్డి. ఈ కేసులో ఏ-2 నిందితుడిగానున్న సునీల్ యాదవ్ తోపాటు ఉమాశంకర్ రెడ్డి భార్యతో వివేకా సంబంధం ఉందని ఆరోపించారు. నిందితుల కుటుంబాల వారితో వివేకాకు వివాహేతర సంబంధం అంటకాడుతూ ఆయన క్యారెక్టర్ ను దెబ్బతీస్తున్నారు.
సోమవారం హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ అవినాష్ రెడ్డికి నోటిసులు ఇచ్చారు. అరెస్ట్ చేస్తారని అంచనా వేసిన అవినాష్ రెడ్డి వెంటనే తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో బెయిల్ పిటిషన్ ఉందని విచారణకు డుమ్మా కొట్టడం ఏంటని హైకోర్టు ప్రశ్నించకపోవడంతో అవినాష్ రెడ్డికి ఊరట లభించినట్లు అయింది. అయితే.. ఆయన్ను రేపు విచారణకు రావాలని సీబీఐ మరోసారి నోటిసులు ఇచ్చింది.