ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన కొంతమంది నేతలు అసంతృప్తితో ఉన్నారని మరోమారు ఋజువైంది. నేతలంతా ఐక్యంగానే ఉన్నామని మీడియాకు చెబుతున్నా లోలోపల మాత్రం పార్టీ వ్యవహారాలపై అసహనంగా ఉన్నారని తేలింది. మోదీ పాలనను జనాల్లోకి తీసుకెళ్లాలని భావించిన కేంద్రం ఇంటింటికి వెళ్లి కేంద్ర పథకాల గురించి వివరించాలని ఆదేశించింది. ఒక్కో నియోజకవర్గాల్లో ఆయా నేతలు కనీసం వంద ఇళ్ళకు వెళ్లాలని టార్గెట్ విధించింది.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ నేతల దృష్టిలో పడాలని పలువురు బీజేపీ నేతలు ఈ కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు పాల్గొంటారని అంత భావించారు కానీ ఈ ఇద్దరు నేతలు మొహం చాటేశారు. ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ ఇద్దరు కాంగ్రెస్ లో చేరుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం చర్చనీయాంశం అవుతోంది.
ప్రస్తుతం ఈ ఇద్దరు బీజేపీలో ఇమడలేకపోతున్నారని కాంగ్రెస్ నేతలతో చర్చలు కొనసాగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ను ఓడించేందుకు బీజేపీ బలం సరిపోదని ప్రాథమికంగా ఈ ఇద్దరు నేతలు ఓ అంచనాకు వచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దాంతో కాంగ్రెస్ తో చేతులు కలిపితే ఎలా ఉంటుందన్న అంశంపై చర్చలు జరుపుతున్నారని చెబుతున్నారు. త్వరలోనే ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని అంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం ఖాయమని ఈటలనే ఊగిసలాటలో ఉన్నారని చెబుతున్నారు.
బీజేపీని ఇప్పటికప్పుడు వీడితే తన విశ్వసనీయత దెబ్బతింటుందన్న అభిప్రాయంతో ఈటల ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటే పార్టీ బహిష్కరణ వేటు వేస్తే ఎంచక్కా కాంగ్రెస్ కండువా కప్పుకోవచ్చున్న వ్యూహంతో ఈటల ఉన్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విలువల రాజకీయం చేసే తాను బీఆర్ఎస్ ను వీడలేదని వారే తనను గెంటేశారని..ఇప్పుడు బీజేపీలో కొనసాగుతున్నా. మరో పార్టీ మారనని చెప్తూ వస్తున్న ఈటల… తెలివిగా వ్యూహం మేరకు నడుచుకుంటున్నారని అంటున్నారు.