మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా వంటేరు, హరీష్ రావు – పరిశీలిస్తోన్న కేసీఆర్..?

వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డిని గెలిపించాలని ఆ మధ్య ఓ సమీక్షలో స్పష్టం చేసిన కేసీఆర్ ఇటీవల మనస్సు మార్చుకున్నట్లు తెలుస్తోంది. వంటేరును మెదక్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయించాలని ఆలోచిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుత మెదక్ ఎంపీగానున్న కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేసీఆర్.. మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఎవరిని బరిలో నిలుపుతారని చర్చ జరుగుతోన్న వేళ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కొత్త ప్రభాకర్ రెడ్డి స్థానంలో గజ్వేల్ అభివృద్ధిని పర్యవేక్షిస్తున్న వంటేరు ప్రతాప్ రెడ్డిని పోటీలో నిలపాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

మెదక్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రత్యర్ధి పార్టీల నుంచి టికెట్ ఆశిస్తోన్న నేతలు బలమైన వారే ఉండటంతో వారికీ ధీటైన నేతలను బరిలో నిలపాలనుకుంటున్నారు కేసీఆర్. పైగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తోన్న కేసీఆర్ తనకు నమ్మకమైన నేతలను ఢిల్లీకి పంపించాలనుకుంటున్నారు. వంటేరు ప్రతాప్ రెడ్డి అయితే అన్నివిధాలుగా సరైన అభ్యర్థి అని కేసీఆర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వంటేరను లోక్ సభకు పోటీ చేయిస్తారని బీఆర్ఎస్ వర్గాలు అభిప్రాయపడుతోన్న ఈ సమయంలో మరో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

Advertisement

మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా హరీష్ రావు పేరు కూడా పరిశీలనలో ఉందని అంటున్నారు. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ క్రియాశీలక పాత్ర పోషించాలంటే హరీష్ రావు లాంటి నేత అవసరమని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకోసం పార్లమెంట్ ఎన్నికల నాటికీ హరీష్ ను బరిలో నిలిపినా ఆశ్చర్యపోనవసరం లేదని టాక్ నడుస్తోంది. హరీష్ రావును ఢిల్లీకి పంపిస్తే కేసీఆర్ అన్న కొడుకు వంశీధర్ రావును సిద్ధిపేట నుంచి పోటీ చేయించేందుకు లైన్ క్లియర్ కూడా అవుతుందన్న లెక్కలో కేసీఆర్ ఉన్నట్లు గుసగుసలు వస్తున్నాయి.

మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ గాలి అనిల్ కుమార్ రోజురోజుకు అక్కడ బీఆర్ఎస్ కు సవాల్ విసిరేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. పార్టీ వ్యతిరేకతతోపాటు మల్లన్నసాగర్ , కాళేశ్వరం భూనిర్వాసితుల సమస్యను ప్రధానంగా ఆధారం చేసుకొని అక్కడ ప్రజలకు చేరువ అవుతున్నారు. పైగా ఆర్థికంగా బలమైన నేత కావడంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా వంటేరు ప్రతాప్ రెడ్డిని లేదా హరీష్ రావును బరిలో నిలిపే అవకాశం ఉంది. చూడాలి మరి ఎన్నికల నాటికీ ఏం జరుగుతుందో..!!

Advertisement