మళ్ళీ తెరమీదకు టీఆర్ఎస్ – పొంగులేటి స్కెచ్ అదుర్స్..!!

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని చావు దెబ్బ కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు ఎలాంటి మార్గాలు ఉన్నాయో పరిశీలిస్తోన్న పొంగులేటి కొత్త వేదికతో కేసీఆర్ వ్యతిరేకుల్ని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే వ్యూహంలో ముందడుగు వేశారు. టీఆర్ఎస్ ( తెలంగాణ రైతు సమాఖ్య ) అనే పేరుతో వేదికను సిద్దం చేసుకున్న పొంగులేటి…ఇదే పేరుతో రాజకీయ పార్టీని రిజిస్ట్రేషన్ కూడా చేయించినట్లు తెలుస్తోంది.

పొంగులేటి అనుచరులే టీఆర్ఎస్ పేరుతో పార్టీని రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికీ కేసీఆర్ వ్యతిరేకులను తన టీఆర్ఎస్ గూటికి తీసుకొచ్చి.. దాదాపు 45స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దింపాలని పొంగులేటి ప్లాన్ గా చెబుతున్నారు. ఇందుకు సంబధించిన కార్యాచరణ కూడా రెడీ అయిందని.. అందుకే ఆయన ఏ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని అంటున్నారు.

ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువురిని పార్టీలో చేరేలా సంప్రదింపులు పూర్తి అయ్యాయన్న గుసగుసలు వస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా ఇంచార్జ్ గా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, నల్గొండ జిల్లాకు చకిలం అనిల్ కుమార్ , వరంగల్ జిల్లా బాధ్యతలను తన వియ్యంకుడైన మాజీ ఎంపీ రామ సహాయం సురేందర్ రెడ్డి కొడుక్కి అప్పగించినట్లుగా చెబుతున్నారు.

మొత్తం 45స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపి 15స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకొని సత్తా చాటాలనేది పొంగులేటి ప్లాన్ గా తెలుస్తోంది. రంగారెడ్డి, ఆదిలాబాద్ ,కరీంనగర్ జిల్లాలకు సంబంధించి సరైన నేతల కోసం పొంగులేటి సెర్చ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ నెల 15న ఉండనుందని సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో..!!