తొలివెలుగు ముగిసిన శకం – New తొలివెలుగు పేరుతో ప్రజల ముందుకు

ప్రజల తరుఫున బలమైన వాణి వినిపించి, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన ప్రముఖ యూట్యుబ్ ఛానెల్ తొలివెలుగు రూపు మార్చుకోనుందా..? ఇన్నాళ్ళు ప్రభుత్వ అవినీతిని ఎండగట్టిన ఈ ఛానెల్… ఇప్పుడు ప్రభుత్వానికి దాసోహమైందా..? ఈ ఛానెల్ మరికొద్ది రోజుల్లోనే ముగిసిన అధ్యాయనంగా మారనుందా..? అంటే అవుననే తెలుస్తోంది.

Advertisement

తొలివెలుగు…తెలంగాణలో ఈ ఛానెల్ పేరు తెలియని వారుండరు. పేరుకు యూట్యూబ్ ఛానెలే అయినా ప్రధాన స్రవంతి మీడియాకు పోటీగా ఓ సెన్సెషన్ క్రియేట్ చేసింది. 2019 జూలైలో ప్రారంభమైన ఈ ఛానెల్ ప్రముఖ జర్నలిస్ట్ నరసింహ రెడ్డి పేరు మీద రిజిస్టర్ అయ్యింది, జర్నలిస్ట్ రఘు ప్రధాన ఫేస్ గా ఉండేది కాని, సిబ్బంది జీతభత్యాలను రవి ప్రకాష్ చూసుకునేవారు. ఈ నాలుగు ఏళ్ల కాలంలో ప్రభుత్వానికి ఏమాత్రం తలొగ్గకుండా జర్నలిజం పవర్ ఏంటో ప్రభుత్వానికి తొలివెలుగు ఛానెల్ రుచిచూపింది. ఎక్కడ అన్యాయం జరిగినా,అవినీతి చోటుచేసుకున్నా తొలివెలుగు బాధితుల పక్షాన పెద్దన్న పాత్ర పోషించింది. అందుకే తొలివెలుగును లేకుండా చేయాలని ప్రభుత్వం 19అక్రమ కేసులు బనాయించింది. రఘు పై 5 కేసులు నరసింహ రెడ్డి పై 14 కేసులు పెట్టింది. దాదాపుగా 350 కోట్లకు పరువునష్టం కేసులు కూడా నమోదు అయ్యాయి. అయినా ఎన్నడూ ప్రభుత్వానికి అమ్ముడుపోకుండా ప్రజల పక్షాన నిఖార్సుగా కొట్లాడింది తొలివెలుగు.

Advertisement

కేసులు నమోదు చేసినా, నయానో, భయానో బెదిరించినా తొలివెలుగు స్వరం మార్చుకోకపోవడంతో తొలివెలుగుతో కాళ్ళ బేరానికి దిగారు పాలకులు. ఎన్నికల సమయంలో తొలివెలుగు కొనసాగితే తమ లక్ష్యం దెబ్బతింటుందని అంచనా వేసిన పాలకులు..తొలివెలుగును తమ గుప్పిట్లోకి తీసుకోవాలనుకున్నారు. ఇంకేముంది ఛానెల్ ప్రసారాల్లో మార్పు వచ్చింది. దీనిని బట్టి లోలోపల చాలా తతంగమే నడిచినట్లు అర్థం అవుతోంది. అందుకే నరసింహ రెడ్డి పేరు మీద ఉన్న ఈ ఛానెల్ ను రవి ప్రకాష్ అనూహ్యంగా తన పేరు మీదకు మార్చుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వీడియోలు తొలగించాలని ఆదేశాలు వచ్చాయని రఘు చాలా సార్లు చెప్పారు. అందుకే తాను ఛానెల్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు అప్పట్లో రఘు చెప్పి ఛానెల్ నుంచి తప్పుకున్నారు. ఈ మధ్య 24 గంటల విద్యుత్ విషయంలోనూ కాంగ్రెస్ , బీఆర్ఎస్ మధ్య జరిగిన రచ్చలో తొలివెలుగు కేటీఆర్ కు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుసగా కథనాలు ప్రసారం చేయడంతో వాటిని యాజమాన్యం ఆపేసినట్లు తెలిసింది. నరసింహ రెడ్డినీ స్క్రీన్ కు దూరంగా ఉండాలని, ఛానల్ లో కొత్త ఇంచార్జ్ ను తీసుకొని నరసింహ రెడ్డినీ సైలెంట్ గా ఉండమని చెప్పడంతో ఛానెల్ వైఖరిలో మార్పు వచ్చిందని గ్రహించిన ఉద్యోగులు నేరుగా రవిప్రకాష్ తో చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడే విషయంలో మీ వైఖరి మారిందా..? అని ప్రశ్నిస్తే.. రవి ప్రకాష్ నుంచి సరైన సమాధానం రాలేదని తెలిసింది.

కాని గడిచిన కొన్నాళ్ళుగా ఛానెల్ ప్రభుత్వ భజన చేస్తున్నట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. గతంలో ఏనాడూ కేసీఆర్ వార్తలను ప్రసారం చేయని తొలివెలుగులో బీఆర్ఎస్ వార్తలకు ప్రాధాన్యం పెరిగింది. ప్రభుత్వం చేస్తోన్న భూదోపిడీపై అటు వెబ్ సైట్ లో కాని,ఇటు చానెల్ లో కాని ఒక్క వార్త కూడా లేదు. ఇప్పటికే తొలివెలుగు వెబ్ సైట్ ను ఆర్ టీవీ వెబ్ సైట్ గా మార్చగా.. మరికొద్ది రోజుల్లోనే తొలివెలుగును కూడా ఆర్ టీవీ గా మార్చనున్నట్లు తెలుస్తోంది. దాంతో తొలివెలుగులోని నరసింహ రెడ్డితో పాటు టీం 20మంది ఛానెల్ నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. ఇన్నాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోట్లడిన తాము..ఇప్పుడు మనస్సాక్షిని చంపుకొని ప్రభుత్వానికి వంత పాడలేమని చానెల్ తో నాలుగేళ్ల బంధానికి ముగింపు కార్డు వేసినట్లు తెలుస్తోంది. నరసింహ రెడ్డితోపాటు సీనియర్ రిపోర్టర్ సోము, టెక్నికల్ టీమ్ హెడ్ చందు కలిసి న్యూ తొలివెలుగు అనే ఛానెల్ ను ప్రారంభిస్తున్నట్లు సమాచారం.. ఇప్పటికే N TOLIVELUGU పేరుతో కొత్త ఛానల్ ను ప్రారంభించినట్లు తెలుస్తుంది.

Advertisement