రకరకాల జాతుల చేపలను వీక్షించే అవకాశం హైదరాబాద్ వాసులకు అసలే ఉండదు. సముద్రతీర ప్రాంతాలకు వెళ్తే తప్ప రకరకాల జాతులకు చెందిన చేపలను చూసే భాగ్యం కలగదు. కానీ ఇప్పుడు హైదరాబాద్ వాసులకు కూడా విభిన్న జాతులకు చెందిన చేపలను వీక్షించే అదృష్టం తలుపు తడుతోంది. అదేలాగంటారా ..? హైదరాబాద్ లో అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రపంచంలోని రకరకాల జాతులకు చెందిన చేపలను ప్రదర్శనలో ఉంచనున్నారు.
శుక్రవారం సాయంత్రం మంత్రులు కేటీఆర్ , తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ఈ అండర్ వాటర్ టన్నెల్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు . కూకట్ పల్లి పరిధిలోని మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఎదురుగానున్న ట్రక్ పార్కింగ్ గ్రౌండ్ లో ఈ ఎగ్జిబిషన్ జరుగుతోంది. ఉదయం 11గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ఈ ప్రదర్శన జరగుతోంది. మొదటి రోజు సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. రెండో రోజు అంటే శనివారం నుంచి టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రెండు నెలల పాటు దాదాపు సమ్మర్ ముగిసే వరకు ఈ అండర్ టన్నెల్ ఎగ్జిబిషన్ కొనసాగుతోంది.
ఈ ప్రదర్శనలో 500రకాల సముద్రపు చేపలను ఉంచారు. అక్వేరియంలోనున్న చేపలను చూడొచ్చు. ఒకే రకమైన జాతికి చెందిన చేపలు కాకుండా విభిన్న జాతులకు చెందిన చేపలను ఈ ఎగ్జిబిషన్ లో ఉంచినట్లు చెప్పారు.ఇక్కడ ప్రదర్శనకు ఉంచిన చేపలలో అరభైమా రకం చేప ప్రత్యేకమైనదిగా చెబుతున్నారు. ఈ చేప రోజుకు కిలోన్నర చికెన్ తింటుందని చెబుతున్నారు. ఈ చేప 60 కిలోలు ఉండగా దీని ధర ప్రస్తుతం మార్కెట్‌లో రూ.6 లక్షలు ఉందని అంటున్నారు. చాలామంది ఈ చేపను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు . ఈ చేప ఉన్న అక్వేరియం దగ్గర సందర్శకులు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.