ఏపీ ముఖ్యమంత్రి జగన్ నుంచి ఆమె తల్లి విజయమ్మ, చెల్లి వైఎస్ షర్మిలకు ప్రాణహాని పొంచి ఉందా..?ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న నేపథ్యంలో సానుభూతి కోసం వైఎస్ కుటుంబీకులను హతమార్చే కుట్రలు ఏమైనా జరిగే అవకాశం ఉందా..? వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా కొనసాగుతోన్న ప్రశాంత్ కిషోర్ సలహాలతో వివేకా తరహాలో మరో ఘాతుకం జరగనుందా.? అంటే అవుననే అంటున్నారు వైసీపీ నేత డీఎల్ రవీంద్ర రెడ్డి.
ఏపీలో ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న క్రమంలో జగన్ నుంచి ఆయన సొంత కుటుంబ సభ్యులు అలర్ట్ గా ఉండాలన్నారు డీఎల్ రవీంద్రరెడ్డి. ముఖ్యంగా వైఎస్ విజయమ్మ, షర్మిలలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎన్నికల్లో మరోసారి గెలిచేందుకు జగన్ ఏమైనా చేసే అవకాశం ఉందని ఆరోపించారు. గత ఎన్నికల్లో కోడికత్తి, వివేకా హత్య ఘటనలతో సానుభూతి క్రియేట్ చేసుకున్న వైసీపీ ఈసారి కూడా అదే స్ట్రాటజీని ఎన్నికలకు ముందు అమలు చేసే అవకాశం ఉందన్నారు. జగన్ పై కోడికత్తి దాడి వెనక ఎలాంటి కుట్రకోణం లేదని కోర్టుకు ఎన్ఐఏ చెప్పింది. అయితే ఈ ఘటనతో వైసీపీ ఎంత లాభపడిందో చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఈసారి కూడా ఇలాంటి వ్యూహాలతో సానుభూతి పొందేలా జగన్ రాజకీయం చేసే అవకాశం ఉందన్నారు.
ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుందని విపక్షాలన్నీ ఆరోపిస్తుండగా డీఎల్ మాత్రం భారతిరెడ్డి రాజ్యాంగం కొనసాగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదివరకు ఇలాంటి తరహ వ్యాఖ్యలు ఎవరూ చేయలేదు. వాస్తవానికి వైఎస్ షర్మిలతో జగన్ కు తలెత్తిన ఆస్తుల విబేధాలకు భారతి రెడ్డినే ప్రధాన కారణమని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే డీఎల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జగన్ అక్రమాస్తుల కేసులో ఒకవేళ జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే భారతిరెడ్డిని సీఎం చేస్తారని ప్రచారం జరుతున్న క్రమంలోనే ఇలాంటి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
వివేకా హత్యకేసులో నిందితులకు శిక్ష పడి తీరుతుందని స్పష్టం చేశారు డీఎల్. ఎంతమంది అధికారులను మార్చిన నేరానికి పాల్పడిన వ్యక్తులు తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. ఇక వచ్చే ఎన్నికల్లో మైదుకూరు నుంచి తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోనని చెప్పడంతో ఆయన ఏ పార్టీలో చేరుతారన్నది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఎన్నికలకు ముందు సానుభూతి కోసం జగన్ ఎవర్నో ఒకర్ని చంపుతారన్న విమర్శలు కొంతకాలంగా రాజకీయ ప్రత్యర్థుల నుంచి వస్తున్నాయి. ఈ క్రమంలోనే డీఎల్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.