వివేకా హత్య కేసులో అసలు పాత్ర ఎవరిదో తేల్చిన సీబీఐ..!

వైఎస్ వివేకా హత్యలో కీలక పాత్ర భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలదేనని సీబీఐ ఆరోపించింది. ఈమేరకు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు నివేదించింది. వైఎస్ భాస్కర్ రెడ్డి మరియు ఉదయ్ కుమార్ రెడ్డిలను తమ కస్టడీకి ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ లతోపాటు ఉదయ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా వివేకా హత్యలో వీరిద్దరి పాత్రను తెలిపింది సీబీఐ.

వివేకా హత్యకు ఉపక్రమించిన సునీల్ యాదవ్, ఎర్రగంగిరెడ్డి తదితరులు వైఎస్ భాస్కర్ రెడ్డికి సన్నిహితులని సీబీఐ కోర్టుకు తెలిపింది. వివేకాతోనున్న రాజకీయ విబేధాలే ఆయనను హతమార్చేందుకు మర్డర్ ప్లాన్ వేశారని సీబీఐ ఆరోపించింది. 2017 లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వివేకా ఓటమి పాలయ్యారు. తన ఓటమికి భాస్కర్ రెడ్డి కారణమని ఆయన ఇంటికి వెళ్లి వివేకా ఆగ్రహం వ్యక్తం చేయడంతో… ఇది మనస్సులో పెట్టుకొని వివేకా హత్యకు కుట్ర పన్నారని కోర్టుకు తెలిపింది సీబీఐ.

ఈ హత్య కుట్రలో వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలదే కీలకపాత్ర అని తేల్చిచెప్పింది. హత్య జరిగిన అనంతరం సాక్ష్యాలను చెరిపేయడంలో వీరిదే కీలక పాత్ర అని…హత్య జరిగినట్లు ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వివేకా గాయాలను ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రితో కనిపించకుండా కుట్లు వేయించారని సీబీఐ వెల్లడించింది.

వివేకాది గుండెపోటు అని నమ్మించేందుకు సిఐ శంకరయ్యను భాస్కర్ రెడ్డి బెదిరించారని.. వారి బెదిరింపులకు లొంగే వివేకాది సహజ మరణమని శంకరయ్య స్టేట్ మెంట్ ఇచ్చారని సీబీఐ ఆరోపించింది. హత్య గురించి ఉదయ్ కుమార్ రెడ్డికి ముందే తెలుసని వెల్లడించింది. హత్య జరిగిన రోజు ఉదయం 4 గంటలకు అతడు ఇంటినుంచి బయటికి వెళ్లినట్లు ఉదయ్ తల్లి కూడా చెప్పారని సీబీఐ వెల్లడించింది. పైగా సాక్ష్యులను ప్రభావితం చేసేలా ఉదయ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారని పేర్కొంది సీబీఐ.