రేవంత్ తో బీఆర్ఎస్ బాస్ పరేషాన్ – కేటీఆర్ బాధంతా అదేనా..?

తెలంగాణ కళను సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీ పట్ల సానుభూతి చూపకపపోగా ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనుకున్నారు కేసీఆర్. ఇందుకోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకోవడమే కాదు ఏకంగా సీఎల్పీని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకొని కాంగ్రెస్ ను ఖతం పట్టించాలనుకున్నారు. కాంగ్రెస్ పతనావస్థకు చేరుకున్న దశలో రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక హస్తం పార్టీ తిరిగి పుంజుకుంది. పార్టీని గతంలో వీడిన నేతలు రేవంత్ నాయకత్వంతో పార్టీలో చేరే దిశగా ఆలోచిస్తున్నారు. ఇది నచ్చని కేసీఆర్ , కేటీఆర్ లు రేవంత్ టార్గెట్ గా విమర్శల జడివాన కురిపిస్తుంటారు. కేసీఆర్ పరోక్షంగా విమర్శల దాడి చేస్తే కేటీఆర్ మాత్రం నేరుగానే మాటల మంటను పుట్టిస్తుంటారు.

Advertisement

Advertisement

తాజాగా ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో రేవంత్ టార్గెట్ గా కేటీఆర్ నోటికి పని చెప్పారు. సోనియాగాంధీని గతంలో బలిదేవత అని విమర్శించిన వ్యక్తికే పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టారని… గాంధీ భవన్ ను గాడ్సేకు అప్పగించి కాంగ్రెస్ పతనానికి వీలునామా రాసుకుందని తనదైన శైలిలో మండిపడ్డారు. రేవంత్ పై విమర్శలు చేస్తూనే.. కాంగ్రెస్ పట్ల పరోక్షంగా కేటీఆర్ సానుభూతి తెలపడం ఏంటో ఆయనకే తెలియాలి. తెలంగాణ ఇచ్చిన పార్టీని లేకుండా చేయాలనుకొని హస్తం ఎమ్మెల్యేలను కారేక్కించింది బీఆర్ఎస్ పార్టీనే. అసలు తెలంగాణలో కాంగ్రెస్ లేదనే ప్రచారం కూడా చేసింది కేటీఆరే. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ బతికిబట్టకట్టడం అంటూ కొత్త, కొత్త డైలాగ్ లు కొడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరికి పీసీసీ ఇవ్వాలనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. దానితో కేటీఆర్ కు సంబంధమే లేదు. అయినా ఎందుకో పదేపదే ఈ అంశంపై కేటీఆర్ మాట్లాడుతున్నారు.

ఎటుపోయి…రేవంత్ పీసీసీ చీఫ్ పోస్ట్ ఊడగొట్టాలనేది కేటీఆర్ స్కెచ్. ఇందుకోసం ఆయన రకరకాల ఎత్తులు, పైఎత్తులు పన్నుతుంటారనేది తెలిసిందే. రేవంత్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రియాంక గాంధీ పర్యటన సందర్భంగా ప్రస్తావించి హైలెట్ అయ్యేలా చూసుకుంటే అవి ప్రియాంక వద్దకు చేరుతాయనేది కేటీఆర్ అనుకున్నట్టున్నారు. అలాగైనా రేవంత్ ను పీసీసీ పదవి నుంచి దించుతారని దింపుడు కళ్ళెం ఆశలతో కేటీఆర్ ఎదురుచూస్తున్నట్టున్నారు.

కానీ రేవంత్ కు ఢిల్లీస్థాయిలో ఎప్పుడో పట్టు దొరికింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోపాటు ప్రియాంక గాంధీలు రేవంత్ నాయకత్వంపై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఏఐసీసీ ఢిల్లీ నేతలు కూడా రేవంత్ తోనే తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని నివేదికలు వెళ్ళాయి కనుక కేటీఆర్ ఎంతప్రయత్నించినా ఆయన ఆశలు నేరవేరవనే వాస్తవాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలుకుతున్నారు.

Advertisement