తెలంగాణ బీజేపీ అద్యక్షుడుగా బండి సంజయ్ ను మార్చడం ఖాయమైంది. రేపోమాపో అధికారిక ప్రకటన వెలువడనుంది. బండి సంజయ్ ను కేంద్ర కేబినేట్ లోకి తీసుకొని కిషన్ రెడ్డి లేదా డీకే అరుణలలో ఒకరిని అద్యక్షుడిగా ప్రకటించాలని హైకమాండ్ డిసైడ్ అయింది. పార్టీలోని అసంతృప్త నేతలు బండి సంజయ్ నేతృత్వంలో పని చేయలేమని స్పష్టం చేశారు. దాంతో అద్యక్షుడిని మార్చడం హైకమాండ్ కు తప్పనిసరిగా మారింది.
కిషన్ రెడ్డిని అద్యక్షుడిగా ప్రకటించాలని హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చింది కానీ ఆయన మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువరించలేదని సమాచారం. అద్యక్ష పదవి పట్ల కిషన్ రెడ్డి విముఖత వ్యక్తం చేస్తే డీకే అరుణకు పదవి అప్పగించాలని జాతీయ నాయకత్వం నిర్ణయించింది. అయితే కిషన్ రెడ్డి అద్యక్ష పదవి చేపట్టేందుకే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉందన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈటల రాజేందర్, కోమటిరెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు వంటి నేతలు బండి సంజయ్ సారధ్యంలో పని చేయలేమని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఈటల, కోమటిరెడ్డిలను ఢిల్లీకి పిలిచి వారి అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేసింది. బండిని మార్చకపోతే తమ దారి తాము చూసుకుంటామని ఒత్తిడి చేయడం…ఈ పరిణామం పార్టీలో పెను ప్రకంపనలు రేపెలా ఉందని అధిష్టానం గ్రహించింది.
దీంతో బండి నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లాలని గతంలో ఆదేశించిన హైకమాండ్ మారిన పరిణామాల నేపథ్యంలో బండిని మార్చేందుకు రెడీ అయింది. బండి స్థానంలో ఈటలకు అద్యక్ష పదవి ఇవ్వాలనే చర్చ జరిగింది కానీ వలస నేతకు పదవి ఇస్తే సీనియర్ నేతల నుంచి సహాయ నిరాకరణ ఎదురు అవుతుంది. అందుకే మద్యేమార్గంగా ఉండేందుకు కిషన్ రెడ్డి పేరును హైకమాండ్ పరిశీలిస్తోంది. అన్ని కుదిరితే రేపోమాపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.