YS Jagan – Sharmila : ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రస్తుతం వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలో పర్యటించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులర్పించారు. అయితే.. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ కుటుంబ సభ్యులు అందరూ ఆయన ఘాట్ వద్ద నివాళులర్పించారు. అందులో సీఎం జగన్ తో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిల కూడా ఉన్నారు.

తన తండ్రి వర్ధంతి సందర్భంగా జగన్, తన చెల్లి షర్మిల ఇద్దరూ ఇడుపులపాయలో పక్కపక్కనే కనిపించారు. వైఎస్సార్ 13 వ వర్థంతి సందర్భంగా వైఎస్ జగన్ తో పాటే ఆయన తల్లి, భార్య భారతి, చెల్లి షర్మిల అందరూ ఇడుపులపాయకు ఒకేసారి చేరుకున్నారు. ఆ తర్వాత ఉదయమే వైఎస్సార్ ఘాట్ ను సందర్శించి వైఎస్సార్ కు నివాళులర్పించారు.
YS Jagan – Sharmila : వైఎస్సార్ సమాధి వద్ద పక్కపక్కనే కూర్చొన్న జగన్, షర్మిల
వైఎస్సార్ సమాధి వద్ద జగన్, షర్మిల పక్కపక్కనే కూర్చున్నారు. వాళ్లిద్దరూ పక్కపక్కనే కూర్చోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. ఏపీలో అన్న పార్టీ పెట్టి విజయం సాధిస్తే.. తాను తెలంగాణలో పార్టీ పెట్టి విజయం సాధించాలని ఆశపడుతున్నారు. వైఎస్సార్టీపీ అనే పార్టీని ఆమె పెట్టారు. తన పార్టీ కోసం పనిచేసేందుకే షర్మిల తల్లి విజయమ్మ.. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈనేపథ్యంలో అన్న, చెల్లి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయని ప్రచారం అవుతున్న నేపథ్యంలో ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని తండ్రికి నివాళులర్పించడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. షర్మిల, జగన్.. ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకోవడం కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే.. జగన్, షర్మిల మధ్య విభేదాలు ఉండటం నిజమేనని.. కానీ.. ఇద్దరూ మాట్లాడుకోనంతగా విభేదాలు మాత్రం లేవని వైసీపీ నేతలు అంటున్నారు.
