YSRCP : ప్రస్తుతం దేశంలో రాష్ట్రపతి ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. గతంలో బీజేపీ పార్టీ బలపరిచిన రామ్ నాథ్ గోవింద్ రాష్ట్రపతిగా నియమితులయ్యారు. ఇప్పుడు కూడా బీజేపీ బలపరిచే అభ్యర్థినే గెలిపించుకోవాలని బీజేపీ పార్టీ తెగ ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి.. బీజేపీతో పాటు.. తన మిత్రపక్షాలు కలుపుకుంటే ఎన్డీఏ అభ్యర్థి 13 వేల నుంచి 15 వేల ఓట్ల దూరంలో ఉన్నారు. అందుకే.. ఎలాగైనా ప్రాంతీయ పార్టీలను కూడా తనవైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ.

నిజానికి గత ఎన్నికల్లో రామ్ నాథ్ గోవింద్ కు టీఆర్ఎస్ తో పాటు వైసీపీ, బిజూ జనతాదళ్ పార్టీలు కూడా సపోర్ట్ చేశాయి. కానీ.. ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ లో పాల్గొనడం లేదు. బిజూ జనతాదళ్ కూడా అటో ఇటో తేల్చుకోలేకపోతోంది. కానీ.. బిజూ జనతాదళ్ చివరి నిమిషంలో బీజేపీకి మద్దతు ఇచ్చే చాన్స్ ఉంది.
YSRCP : ఎటూ తేల్చుకోలేకపోతున్న వైఎస్ జగన్
ఈసారి టీఆర్ఎస్ కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడం లేదు కాబట్టి.. వైఎస్సార్సీపీ పార్టీ కీలకం కానుంది. వైసీపీ పార్టీకి ప్రస్తుతం 23 మంది ఎంపీలు ఉన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వైసీపీ పార్టీ.. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో బీజేపీకి మద్దతు ఇస్తే బీజేపీ సునాయసంగా గెలుస్తుంది.
అందుకే.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఈసారి సీఎం జగన్ కీలకం కాబోతున్నారు. అందుకే.. సీఎం జగన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెల జులై 18న రాష్ట్రపతి ఎన్నికలకు ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ.. వైసీపీతో మంతనాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు జులై 4న ప్రధాని నరేంద్ర మోదీ.. ఏపీ పర్యటనకు రానున్నారు. ఆయన విశాఖపట్టణం, నర్సాపురం జిల్లాల్లో పర్యటించనున్నారు. అప్పుడే సీఎం జగన్ తో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా భేటీ కానున్నట్టు తెలుస్తోంది. అలాగే.. ఎన్డీఏ బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థి కూడా సీఎం జగన్ ను కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రి అమిత్ షా కూడా త్వరలో సీఎం జగన్ ను కలిసే చాన్స్ ఉంది.
ఇదెలా ఉంటే.. విపక్ష పార్టీలు కూడా వైఎస్ జగన్ వైపే చూస్తున్నాయి. ఆయన మద్దతు కోసం ఎదురు చూస్తున్నాయి. విపక్ష పార్టీలు బలపరిచే రాష్ట్రపతి అభ్యర్థికే మద్దతు ఇచ్చేలా పావులు కదుపుతున్నాయి. దానికోసమే ప్రశాంత్ కిషోర్ ను కూడా రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో వైఎస్ జగన్ ఎటువైపు నిర్ణయం తీసుకుంటారో అని అందరూ ఎదురు చూస్తున్నారు. వైఎస్ జగన్ కు ఢిల్లీలో పెద్ద సవాల్ ఎదురైంది. దాన్ని ఆయన ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే.