Farmers Festival : రైతు దేశానికే వెన్నుముక, రైతే రాజు. రైతులు వ్యవసాయం చెయ్యనిదే మనకు పూట గడవదు, అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండగే ఈ ఏరువాక పున్నమి. జ్యేష్ఠ మాసం ప్రారంభం అయిన తర్వాత వర్షాలు కురవడం మొదలవుతాయి, దానివలన భూమి తడిసి, మెత్తబడుతుంది. ఏరువాక పున్నమి రోజు న దుక్కి దున్నడం, వ్యవసాయ పనులు చెయ్యడం మొదలు పెడతారు. అందుకే ఈ ఏరువాక పండుగను జరుపుకుంటారు. ఏరువాక ముఖ్య అర్థం నాగలితో దుక్కిని మొదలుపెట్టడం. ఈ ఏరువాక పండుగ రోజు రైతులు ఉదయమే లేచి, పశువులకు ఉదయమే స్నానాలు చేయిస్తారు, పశువులను అలంకరిస్తారు, పొలాల దగ్గరకు వెళ్లి అక్కడ భూతల్లికి పూజలు కూడా చేస్తారు.
ఎంతటి గొప్పవారికైనా, లేని వారికైనా కడుపు నిండడడానికి కారణం రైతు పండించే పంట. రైతులు వ్యవసాయం చేయకపోతే ఎంతటి వారైనా ఆకలితో బాధపడవలసిందే, అందుకే రైతును రాజు అన్నారు, రైతు లేకుండా రాజ్యమే ఉండదు అన్నారు, దేశానికి వెన్నుముక రైతే అన్నారు, రైతు అన్నదాత అని కూడా అన్నారు, దేశ ప్రగతికి మూలం రైతు అన్నారు, రైతును జై కిసాన్ అని అన్నారు, కానీ దీనివలన ఏమిలాభం? ప్రస్తుతం రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రకృతి కోపానికి బలి అవుతూ, కరువు కాటకాల అంచుల్లో చిక్కుకుని, అధికారుల నిర్లక్ష్యానికి నష్టపోతూ,అధికంగా పెరిగిన వడ్డీ రేట్లతో సతమతమవుతూ,పురుగు మందుల కల్తీ, నకిలీ విత్తనాలు, పండించిన పంట వలన కలిగే నష్టం, ఇలా వ్యవసాయాన్ని చేసే అన్నదాతకే ఈరోజు ఆకలి మిగిలింది. కష్టాలు తట్టుకోలేక ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు. అన్నం విలువ పండించే రైతుకు మాత్రమే తెలుస్తుంది, అన్నం విలువ తెలియని ఎంతో మంది ధనవంతులు మాత్రం అన్నాన్ని వృధా చేస్తున్నారు.
Farmers Festival : రైతులు జరుపుకునే పండుగ.

మన దగ్గర ఎక్కువగా ఉంది కదా అని వృధా చెయ్యకుండా దానిని ఎంతో మంది ఆకలితో బాధపడుతున్న వారికి పెట్టండి. అప్పుడే రైతు పడ్డ కష్టం వృధా అవ్వదు. ఈ రోజు ఏరువాక రైతు దుక్కి దున్నడానికి సిద్దం అవుతున్నాడు, కానీ వ్యవసాయశాఖ విత్తనాలకు ఈసారి రాయితీ ఇవ్వలేదు, విత్తనాల కంపెనీలు ధరలను కూడా ఎక్కువగా పెంచారు, రైతులకు అందే రైతుబంధు నగదు పడలేదు, బ్యాంకు వాళ్లు విడుదల చేయవలసిన వార్షిక రుణ ప్రణాళికను ఇంకా విడుదల చేయలేదు. దీని వలన పెట్టుబడిని ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాక తక్కువ భూమి ఉన్న రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వడ్డీ వ్యాపారుల చేతుల్లో మళ్లీ నలిగి పోతాము అని భయపడుతున్నారు. రైతు కష్టాలు పోయి, రైతు పడ్డ శ్రమ వృధా అవ్వకుండా ఉండాలి అని, రైతులు జరుపుకునే ఈ ఏరువాక పున్నమి పండుగ రోజున మనమందరం కోరుకుందాం.