RIP Krishnam Raju : రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో తెలుగు ఇండస్ట్రీ ఒక్కసారిగా మూగబోయింది. రెబల్ స్టార్ ఫ్యామిలీలోనూ విషాద చాయలు అలుముకున్నాయి. కృష్ణంరాజు ఇక లేరని తెలుసుకొని ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కృంగిపోతున్నారు. ఆయన మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతి చెబుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు డయాబెటిస్ ఉండటం, పోస్ట్ కోవిడ్ సమస్యలు రావడం అలాగే.. కార్డియక్ అరెస్ట్ కావడంతో ఆసుపత్రిలోనే కన్నుమూశారు.

కృష్ణంరాజు మృతితో ప్రభాస్ ఫ్యామిలీ కూడా కన్నీరు మున్నీరు అవుతుంది. ప్రభాస్ అయితే పెదనాన్నను చూసి బావురుమంటున్నాడు. పెదనాన్నతో ఆయనకు ఉన్న అనుబంధం అటువంటిది. తనకు కొడుకు లేకున్నా.. ప్రభాస్ నే సొంత కొడుకుగా చూసుకుంటారు కృష్ణంరాజు. ప్రభాస్ కూడా ఆయన్ను తండ్రి కంటే ఎక్కువగా భావిస్తాడు. అయితే.. కృష్ణంరాజు మృతితో ఆయన ముగ్గురు పిల్లల బాధ్యత ఇప్పుడు ప్రభాస్ పై పడింది.
RIP Krishnam Raju : తన కూతుళ్ల బాధ్యతలు పూర్తి కాకముందే కన్నుమూసిన రెబల్ స్టార్
కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్ల పేర్లు ప్రసీది, ప్రకీర్తి, ప్రదీప్తి. ముగ్గురూ ఇప్పుడు చదువుతున్నారు. వాళ్ల బాధ్యతలు ఇంకా పూర్తి కాలేదు. ప్రభాస్ పెళ్లి తర్వాత తన కూతుళ్ల పెళ్లిళ్లు చేయాలని కృష్ణంరాజు భావించారట. కానీ.. ఇంతలోనే ఆయన అకాల మరణం చెందడంతో ఇప్పుడు వాళ్ల పెళ్లి బాధ్యత ప్రభాస్ పై పడింది. కృష్ణంరాజు పెద్ద కూతురు లండన్ లో ఎంబీఏ పూర్తి చేసింది. రెండో కూతురు హైదరాబాద్ జేఎన్టీయూలో ఆర్కిటెక్చర్ చదువుతోంది. మూడో అమ్మాయి సైకాలజీలో డిగ్రీ చేసింది. ఇప్పుడు ముగ్గురు కూతుళ్ల పెళ్లిళ్ల బాధ్యత ప్రభాస్ మీద పడింది. తన ముగ్గురు చెల్లెళ్ల పెళ్లితో పాటు వాళ్ల ఉన్నత చదువులు, ఇతర బాధ్యతలు అన్నీ ఇక ప్రభాసే చూసుకోవాల్సి ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.