సకాలంలో వానలు లేక పూర్తిగా డీలా పడిన తెలంగాణ రైతాంగానికి బీఆర్ఎస్ సర్కార్ తీపి కబురు చెప్పింది. వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు బంధు నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 26వ తేదీ నుంచి రైతుల ఖాతాలో డబ్బులు జమా చేయనుంది. రైతు బంధు నిధులతోపాటు పోడు పట్టాలు కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోడు పట్టాలు పొందిన రైతులకు కూడా రైతు బంధు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు.
సోమవారం తెలంగాణ సెక్రటేరియట్ లో మంత్రులు, సాగునీటిపారుదల అధికారులతో కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రైతు బంధు నిధులపై చర్చించారు. రైతులకు సకాలంలో రైతు బంధు డబ్బులను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆర్థిక మంత్రి హరీష్ రావుకు సూచించారు.
ప్రస్తుతం పంటలు వేసేందుకు రైతులు సిద్దమయ్యారు. కానీ వరుణ దేవుడు కరుణించడం లేదు. వర్ధం పడితే విత్తనాలు వేసేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే రైతులకు పెట్టుబడి సాయం విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కేసీఆర్ సూచించారు. మొదట ఎకరం ఉన్న రైతులకు డబ్బులను విడుదల చేసి క్రమంగా రైతులందరికీ రైతు బంధు డబ్బులను వారి, వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.
కాగా అన్ని అర్హతలు ఉండి రైతు బంధు సాయం అందని వారు ఎవరైనా ఉంటే పట్టా పుస్తకం, బ్యాంకు అకౌంట్ పత్రాలతో ఆయా ప్రాంత ఏఈఓలను కలిసి వివరాలు అందించాలసి ఉంటుంది.