ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో కొత్తగా రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ పేరుతో ఓ కొత్త రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ కాగా తాజాగా ఏపీలో కూడా మరో కొత్త పార్టీ ఏర్పాటు కాబోతోంది. ఈ పార్టీని ఏర్పాటు చేస్తున్నది ప్రస్తుత రాజకీయ నేతలు కాదు. అసంతృప్త వాదులు అసలే కాదు. సినీ గేయ రచయిత అయిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు.
ఏపీలో కొత్త పార్టీని స్థాపించనున్నట్లు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. పార్టీ పేరును కూడా ప్రకటించిన ఆయన తెలుగు భాష పరిరక్షణ కోసం తన పార్టీ పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. జై తెలుగు పేరుతో పార్టీ స్థాపించనున్నట్లు చెప్పారు. తెలుగు భాషను కాపాడుకునేందుకు, తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రస్తుత తరానికి తెలియజేయాల్సిన అవసరముందని నొక్కి చెప్పిన ఆయన…తెలుగు భాష అంతరించిపోకుండా ఉండాలనే లక్ష్యంతో పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
మరోవైపు రాజకీయాల్లో విలువలు పతనం అవుతున్నాయని అభిప్రాయపడిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు… ఆ విలువల రాజకీయాలను తీసుకొచ్చేందుకు పార్టీ పని చేస్తుందని అన్నారు. తన పార్టీ గుర్తు “రథం” అని తెలిపారు. పార్టీలకతీతంగా అందరూ తెలుగు భాష కోసం జై తెలుగు పార్టీకి మద్దతుగా నిలవాలని జొన్నవిత్తుల అభ్యర్థించారు. మరి సినీ రంగంలో సక్సెస్ అయిన జొన్నవిత్తుల పొలిటికల్ చదరంగంలో ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలి.