అమిత్ షా తో కేటీఆర్ భేటీ – బీఆర్ఎస్ – బీజేపీల మధ్య సంథింగ్..సంథింగ్..?

రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్తున్న మంత్రి కేటీఆర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానుండటం హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ , బీఆర్ఎస్ ఒకటేనని ప్రచారం జరుగుతోన్న వేళ ఈ సమావేశం జరుగుతుండటం చర్చనీయాంశం అవుతోంది.

Advertisement

కొన్నాళ్ళుగా బీజేపీని టార్గెట్ చేసే విషయంలో బీఆర్ఎస్ తటపటయిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ నిలిచిపోవడంతోనే కేసీఆర్, కేటీఆర్ లు బీజేపీపై గాండ్రింపులు బంద్ చేశారన్న వాదనలు ఉన్నాయి. ఇవే అనుమానాలను బీజేపీ నేతలు వ్యక్తం చేశారు.

Advertisement

ఈ ప్రచారం ప్రారంభమైన నాటి నుంచి తెలంగాణలో బీజేపీ పరిస్థితి పూర్తిగా తలకిందులు అయింది. పార్టీలో చేరాలనున్న నేతలు వెనకడుగు వేస్తున్నారు. వలస నేతలు కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది.

బీజేపీ ఇన్నాళ్ళు తెచ్చిపెట్టుకున్న హైప్ పూర్తిగా కొట్టుకుపోతుంది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనన్న అభిప్రాయానికి జనం కూడా వచ్చేస్తున్నారు. దీంతో తెలంగాణ బీజేపీలో భయం మొదలైంది. ఈ ప్రచారంపై బీజేపీ నేతలు గట్టిగా ఎదురుదాడి చేస్తున్నారు.

కాంగ్రెస్ కు జాకీలు పెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆరే ఖరారు చేస్తారని అంటున్నారు. ఇలా బీజేపీపై పడిన మరకలను తుడిచివేసేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్న వేళ అమిత్ షా తో కేటీఆర్ సమావేశం కానుండటం అనేక అనుమానాలను పెంచేస్తోంది.

Advertisement