తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ అభ్యర్థుల ఎంపికపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ విషయంలో కాస్త దూకుడుగానే ఉంది. దాదాపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తైందని ఆషాడం ముగియగానే కేసీఆర్ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రతిపక్షాల కంటే ముందంజలో ఉండేందుకు బీఆర్ఎస్ వ్యూహం సిద్దం చేసినట్లు చెబుతున్నారు.
అభ్యర్థుల ఎంపిక పూర్తైందని కానీ, ఈసారి మాత్రం 12మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు ఐదుగురు మంత్రులపై వేటు తప్పదని అంటున్నారు. ఎమెల్యేలపై వేటు ఒకే కానీ మంత్రులపై వేటు వేస్తారనే ప్రచారమే అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. మంత్రివర్గంలోకి తీసుకునే ముందు సమర్ధత, సామజిక సమీకరణలు, విశ్వసనీయత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గంలో చోటు కల్పిస్తారు. అలాంటిది వారికీ ఎన్నికల్లో టికెట్ నిరాకరించడమంటే చర్చనీయంశమే.
బీఆర్ఎస్ తరుఫున టికెట్ నిరాకరణకు గురయ్యే మంత్రుల జాబితాలో మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, జగదీశ్వర్ రెడ్డి , గంగుల కమలాకర్ లు ఉన్నాయి. చామకూర మల్లారెడ్డిపై భూకబ్జా ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. ఆయనపై ఐటీ, ఈడీ దాడులు కూడా జరిగాయి. మల్లారెడ్డి తన వ్యాఖ్యల ద్వారా ప్రజల్లో కూడా లీడర్ ఇమేజ్ ను కోల్పోయారు. ఫామ్ హౌజ్ ఎపిసోడ్ లో మరో మంత్రి నిరంజన్ రెడ్డి భూకబ్జాకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.
మంత్రి కొప్పుల పనితీరు ఏమాత్రం మెరుగ్గా లేదని కేసీఆర్ చేయించిన సర్వే నివేదికల్లో తేలింది. మరోవైపు… గంగుల ప్రాతినిధ్యం వహిస్తోన్న కరీంనగర్ లో బీజేపీ బలపడుతోంది. మంత్రిగా కొనసాగుతున్న గంగుల… జిల్లాలో బీజేపీ ఎదుగుదలకు చెక్ పెట్టలేకపోయాడని కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారు. మరోవైపు మైనింగ్ అంశంలో గంగులపై ఆరోపణలు ఉన్నాయి. జగదీశ్ రెడ్డి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు కానీ, వరుసగా రెండుసార్లు ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో నల్గొండ జిల్లా నుంచి మరో కొత్త మొహానికి అవకాశం లేకుండా పోతున్నది. అందుకే జగదీశ్ ను ఎమ్మెల్సీ చేయాలనుకుంటున్నారు కేసీఆర్. ఈ ఊహగానలే నిజమై వీరికి టికెట్ నిరాకరిస్తే మాత్రం అది సంచలనం కానుంది.
Also Read : కాంగ్రెస్ లోకి ఇందిరా శోభన్..?