Lifestyle : గోరింటాకు ఆడపిల్లల అలంకరణలో ప్రత్యేకమైనదిగా మారిపోయింది. పురాతన కాలం నుంచి ఇప్పటివరకు గోరింటాకును పెట్టుకోవడం ఆచారంగా వస్తుంది. ఇప్పటి టాటూల యుగంలో కూడా గోరింటాకును పెట్టుకుంటున్నారంటే గోరింటాకుకు అంత ప్రాముఖ్యత ఉంది. పెండ్లి అయినా, పేరంటమైనా, పండుగైన, ఫంక్షన్ అయినా పడుచు పిల్ల నుంచి పండు ముసలి వరకు, అలాగే పాల బుగ్గల చిన్నారులదాకా గోరింటాకు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా గోరింటాకు వచ్చిందంటే చాలు ఆడబిడ్డలు చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. అయితే ఆషాడం లోనే ఎందుకు గోరింటాకును పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మన భారతీయులు అనుసరించే ప్రతి ఆచార సాంప్రదాయాల వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఆడవాళ్లు గోరింటాకు పెట్టుకోవడం వెనుక కూడా ఒక ప్రయోజనం ఉంది. అది ఏంటంటే ఆషాడమాసం అంటే వర్షాకాలం. ఈ వర్షాకాలంలో వర్షాలు బాగా పడతాయి. దీనివలన సూక్ష్మజీవులు, అంటు వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఆడవాళ్లు ఎక్కువగా నీటితోనే పనిచేస్తుంటారు. ఇలా చేయడం వలన వాళ్ళ కాళ్లు, చేతులు ఎల్లప్పుడూ తడిగానే ఉంటాయి. దీని వలన ఆడవాళ్లు తొందరగా అంటువ్యాధుల బారిన పడతారు. కనుక గోరింటాకును పెట్టుకుంటే ఎటువంటి రోగాలు వారికి కలుగవు. అలాగే ఆడవారి అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. గోరింటాకు పెట్టుకోవడం వలన వాటిలోని అధిక వేడిని లాగేస్తుంది. దీని వలన గర్భాశయ దోషాలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు.
Lifestyle : ఆషాడం లోనే ఎందుకు గోరింటాకును పెట్టుకోవాలి ?
మన పురాణాల్లోనూ గోరింటాకు పుట్టుక గురించి ఒక కథ ఉంది. గోరింటాకు గౌరీ దేవికి ప్రతీక. గౌరీ ఇంటి ఆకు, గోరింటాకుగా మారిందని పురాణాలు చెబుతున్నాయి. గోరింటాకు ఎలా పుట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం. గౌరీదేవి తను చిన్నతనంలో చెలికత్తెలతో కలిసి ఆటలాడటానికి వనానికి వెళుతుంది. ఆ సమయంలో ఆమె రజస్వల అవుతుంది. ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క భూమిని తాకగానే ఒక మొక్కగా ఉద్భవించింది. ఆ వింతను చూసిన చెలికత్తెలు పరిగెత్తుకుంటూ వెళ్లి పర్వత రాజుకు చెబుతారు. పర్వత రాజు సతీసమేతంగా వనానికి వెళ్లేసరికి ఆ మొక్క పెరిగి పెద్ద చెట్టు అవుతుంది. అప్పుడు ఆ చెట్టు ‘సాక్షాత్తు పార్వతి రుధిరాంశతో జన్మించాను. నావల్ల ఈ లోకంలో ఏదైనా ప్రయోజనం ఉందా’ అని అడుగుతుంది. అప్పుడు గౌరీదేవి చిన్నపిల్లల చేష్టలతో ఆ చెట్టు ఆకు కోస్తుంది. అప్పుడు గౌరీదేవి వేళ్ళు ఎర్రగా అయిపోతాయి. అది చూసిన పర్వత రాజు దంపతులు అయ్యో బిడ్డ చెయ్యి కాలిపోయింది అని బాధపడేలోపు గౌరీదేవి తనకు ఎలాంటి హాని కలగలేదని చెబుతోంది. పైగా ఈ రంగు చాలా అలంకారంగా అనిపిస్తుంది అని అంటుంది.అప్పుడు పర్వత రాజు ఇకపై ఈ చెట్టు స్త్రీ సౌభాగ్యానికి గుర్తుగా భూలోకంలో ప్రసిద్ధి చెందుతుందని తెలిపారు. అలాగే ఆడవారు గర్భాశయ దోషాలను గోరింటాకు తొలగిస్తుందని చెబుతాడు.