Devotional Facts : ప్రతి ఒక్క గ్రామాలలో బొడ్రాయి అనేది తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు గ్రామదేవతలే తమను కష్టాల నుంచి కాపాడుతారని గ్రామ ప్రజల విశ్వాసం. ఎటువంటి దుష్ట శక్తులు ఊరిలోకి ప్రవేశించకుండా ఈ బొడ్రాయిని ప్రతిష్టిస్తారు. అమ్మవార్లకు ప్రతీకగా ఊరి నడి బొడ్డులో బొడ్రాయిని ప్రతిష్టిస్తారు. ప్రతి ఏటా బొడ్రాయికి పూజలు చేస్తూ ఉంటారు. అలాగే గ్రామాలను నిర్మించేటప్పుడు పొలిమేరలను నిర్ణయించి, వైశాల్యానికి మధ్య భాగంలో బొడ్రాయిని ప్రతిష్టిస్తారు.మానవ శరీరంలో మధ్య భాగంలో నాభిలాగా, గ్రామానికి బొడ్రాయి మధ్య భాగంగా ఉంటుంది.
అందుకే దానికి బొడ్డు రాయి అని పేరు వచ్చింది.బొడ్రాయి మొత్తం మూడు భాగాలుగా ఉంటుంది. క్రింది భాగాన్ని బ్రహ్మా స్వరూపంగా భావించి నాలుగు పలకలుగా చెక్కుతారు. మధ్య భాగాన్ని విష్ణువుకు ప్రతీకగా ఎనిమిది పలకలతో చెక్కుతారు. పై భాగాన్ని శివుడి స్వరూపంగా భావించి లింగాకారంగా చెక్కుతారు. గ్రామానికి మధ్య భాగంలో గద్దెను నిర్మించి దానిపైన బొడ్రాయిని ప్రతిష్టిస్తారు. అంతకుముందు బొడ్రాయి కింద ఎనిమిది మంది పోలిమేర దేవతలకు అధిదేవత, శక్తి స్వరూపిణిగా కొలిచే శీతల దేవి అమ్మవారి యంత్రాన్ని ప్రతిష్టిస్తారు. ఆయా దిక్కులకు సంబంధించిన యంత్రాలను భక్తి పూర్వకంగా ప్రతిష్టాపన చేస్తారు.
Devotional Facts : బొడ్రాయిని ఊరి మధ్యలో ఎందుకు ఉంచుతారో తెలుసా ?

కొన్ని ప్రాంతాలలో వారు కేవలం బొడ్రాయిని మాత్రమే ప్రతిష్టిస్తారు. మరికొన్ని గ్రామాలలో గ్రామ దేవతలను కలిపి కూడా పూజిస్తారు. వరదలు, ఇతర కారణాల వలన బొడ్రాయి భూమిలో కూరుకుపోయినప్పుడు బొడ్రాయికి స్థానచలనం కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు బొడ్రాయిని పునః ప్రతిష్టాపన చేస్తారు. ఈ సందర్భంగా గ్రామాలలో భారీ ఎత్తున ఉత్సవాలు జరిపిస్తారు. బొడ్రాయి పండుగ సమయంలో తమ బంధువులను పిలుచుకోని వేడుకలు జరుపుకుంటారు. ఆడపిల్లలకు ఒడి బియ్యం పోస్తారు. ప్రతిష్టించేటప్పుడు గ్రామస్తులకు కొన్ని ఆంక్షలు విధిస్తారు. ప్రతిష్ట జరిగే రోజు గ్రామ కట్టడి చేస్తారు. ఊరి వాళ్లంతా గ్రామంలోనే ఉండేలా, ఎవరు పొలిమేర దాటి బయటికి వెళ్లకుండా, అలాగే బయటి వాళ్లు లోపలికి రాకుండా చూస్తారు.