Chandrababu : హైదరాబాద్ ను నేనే డెవలప్ చేశాను. హైటెక్ సిటీ నేనే కట్టించా.. హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీ రావడానికి కారణం నేను. నేనే లేకపోతే హైదరాబాద్ ఇప్పుడు ఎలా ఉండేదో ఊహించుకోవడానికి కూడా కష్టమే.. అంటూ హైదరాబాద్ గురించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు.. ఎన్నో వేదికల మీద చెప్పారు. అసలు.. హైదరాబాద్ ను ఎవరు డెవలప్ చేశారు అనేది పక్కన పెడదాం. అయితే.. ఎప్పుడో ఒకసారి హైదరాబాద్ గురించి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేస్తే ఓకే కానీ.. హైదరాబాద్ ఇప్పుడు వేరే రాష్ట్రంలోకి వెళ్లిపోయింది. ఆ రాష్ట్రానికి, ఏపీకి ఇప్పుడు సంబంధమే లేదు. ఇలాంటి సమయంలో అందులోనూ ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు కూడా మళ్లీ అదే హైదరాబాద్ ను ఉటకించడం దేనికి నిదర్శనం.

ఎందుకంటే… ఇంకో రెండేళ్లలో రాష్ట్రానికి ఎన్నికలు రాబోతున్నాయి. చంద్రబాబు తన దృష్టిని భవిష్యత్తు మీద పెట్టాలి. 2024 ఎన్నికల్లో ఎలా గెలవాలో వ్యూహాలను రచించాలి కానీ.. ఇంకా హైదరాబాద్ ను పట్టుకొని వేలాడితే ఎలా? హైదరాబాద్ ను చంద్రబాబు అభివృద్ధి చేస్తే చేసి ఉండొచ్చు. కానీ.. ఇప్పుడు ఆ అభివృద్ధి వల్ల.. చంద్రబాబుకు ఒరిగేదేం లేదు కదా. ఏపీ సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు చేయాలనుకుంటే.. దానికి చాలా మార్గాలు ఉన్నాయి కానీ.. ఇంకా హైదరాబాద్ గురించి మాట్లాడితే.. జగన్ ను విమర్శించినట్టు ఎలా అవుతుంది? అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Chandrababu : 2004 లో ఉమ్మడి ఏపీకి జగన్ సీఎం అయి ఉంటే హైదరాబాద్ పరిస్థితి ఏంటో?
ఏపీలో ఉన్న ప్రాజెక్టులను ఆపేస్తున్నారు. అన్నింటినీ కూల్చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తి 2004 లో ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి అయి ఉంటే.. హైదరాబాద్ పరిస్థితి ఏమయ్యేదో. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన హైటెక్ సిటీ, ఐఎస్బీని కూల్చేసేవారా? ఎయిర్ పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు లాంటి ప్రాజెక్టులను కూడా ఆపేసేవారా? ఏపీ రాజధాని అమరావతిని నా మీద కక్షతో శ్మశానం చేయాలని చూస్తున్నారు. ఒకవేళ 2004 లో జగన్ కు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చి ఉంటే.. హైదరాబాద్ ను కూడా నాశనం చేసేవారు.. అన్నట్టుగా చంద్రబాబు ఇటీవల మాట్లాడారు.
అయితే.. చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ పార్టీ లైట్ తీసుకున్నప్పటికీ.. టీడీపీ నేతలు మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. తమ అధినేత.. ఎందుకు పాత కాలపు విషయాలను తవ్వి తీస్తున్నారు అంటున్నారు. పార్టీ శ్రేణులు ఈ విషయంలో చాలా కన్ఫ్యూజన్ కు గురవుతున్నారు. 2024 లో ఎలా పార్టీని అధికారంలోకి తీసుకురావాలో చంద్రబాబు ఆలోచించాలి కానీ.. ఇలాంటి వ్యాఖ్యలు ఏంటి.. ప్రస్తుతం పార్టీని ముందుకు నడిపించే ఒక నాయకుడు లేడు. ఈ విషయంపై చంద్రబాబు సీరియస్ గా దృష్టి పెట్టాలి అంటూ పార్టీ శ్రేణులు హితువు పలుకుతున్నారు.