Chandrababu Ring : ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గురించి ప్రస్తుతం ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. ఆయన చేతికి ఉన్న ఉంగరం. అవును.. నిజానికి చంద్రబాబు బయట కనిపించినప్పుడు లేత పసుపు రంగు డ్రెస్ మాత్రమే వేసుకుంటారు. చేతికి వాచ్ పెట్టుకోవడం.. బంగారు ఆభరణాలు ధరించడం.. గోల్డ్ రింగ్స్ ధరించడం.. ఇలా ఏవీ ఉండవు. చాలా సామాన్యంగా కనిపిస్తారు ఆయన.

కానీ.. చాలా రోజుల నుంచి చంద్రబాబు నాయుడు తన చేతి వేలికి ఓ రింగ్ ను తొడుగుతున్నారు. ఆయన చేతికి ఉంగరం ఉన్న విషయం.. ఇటీవల మదనపల్లెలో జరిగిన భారీ బహిరంగ సభలో బయటపడింది. దీంతో అందరి చూపు చంద్రబాబు చేతి వేలికి ఉన్న ఉంగరం వైపునకు మళ్లింది.
Chandrababu Ring : కార్యకర్తలకు అభివాదం చేస్తున్న సమయంలో కనిపించిన రింగు
మదనపల్లెలో జరిగిన మీటింగ్ కు హాజరయిన సమయంలో చంద్రబాబు నాయుడు.. కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా తన చేతి చూపుడు వేలుకు ఉన్న ఉంగరాన్ని కార్యకర్తలు గుర్తించారు. ఉంగరం వేలుకు చాలామంది రింగ్ ను తొడుగుతారు. కానీ.. చంద్రబాబు మాత్రం తన ఎడమ చేతి చూపుడు వేలుకు పెట్టుకున్నారు.
అసలు.. ఆ ఉంగరం ఏంటి? దాని చరిత్ర ఏంటి? ఎందుకు ఎడమ చేతి చూపుడు వేలుకు పెట్టుకున్నారు అని అందరూ తెగ టెన్షన్ పడుతున్న తరుణంలో చంద్రబాబు నాయుడే ఏకంగా దాని గురించి వివరణ ఇచ్చేశారు. అది మామూలు ఉంగరం కాదు. ఆ ఉంగరంలో ఒక చిప్ ఉంటుంది. ఆ చిప్, కంప్యూటర్ తో లింక్ అయి ఉంటుంది. ఆ చిప్ ఎప్పటికప్పుడు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని కంప్యూటర్ కు చేరవేస్తుంది. తను ఏ పని చేసినా.. చివరకు నిద్రపోతున్నా కూడా ఆ సమయంలో తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, గుండె వేగం ఎలా ఉంది. పల్స్ రేట్ ఎలా ఉంది.. ఇలా అన్ని రకాల వివరాలను ఆ చిప్ కంప్యూటర్ కు చేరవేస్తుంటుంది.

ప్రతి రోజు తన రిపోర్ట్ చూసుకొని ఏవైనా తేడాలు ఉంటే వెంటనే దానికి సంబంధించిన చికిత్సను చంద్రబాబు తీసుకుంటారట. అందుకే ఆ ఉంగరాన్ని చంద్రబాబు ధరిస్తున్నారట. ఆ విషయాన్ని టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబే స్వయంగా చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.