Rahul Gandhi : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. ఇంకో రెండేళ్లలో దేశంలో సాధారణ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ యాత్రను ప్రారంభించారు. దాదాపు ఈ యాత్ర 5 నెలల పాటు ఉండనుంది. అంటే.. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు ఈ యాత్ర కొనసాగనుంది. దేశవ్యాప్తంగా 200 కు పైగా లోక్ సభ స్థానాల్లో రాహుల్ గాంధీ యాత్ర జరగనుంది. నిజానికి.. రాహుల్ గాంధీ నిత్యం ప్రజల్లో ఉండాలనేదే కాంగ్రెస్ నేతల కోరిక కూడా. రాహుల్ గాంధీ ఎప్పుడూ ప్రజల్లో తిరుగుతుంటే అక్కడ స్థానికంగా ఉండే క్యాడర్ లోనూ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.

రెండు వందలకు పైగా లోక్ సభ స్థానాల్లో దాదాపు 3500 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. ఇక.. ఇది రాహుల్ గాంధీకి చివరి ప్రయత్నం అని.. ఈ యాత్రతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వేవ్ రావాల్సిందేనని.. ఆ వేవ్ 2024 ఎన్నికల్లో చూపించాని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. మరి.. కాంగ్రెస్ కు పూర్వ వైభవం రావాలంటే కాంగ్రెస్ పార్టీ గాడిలో పడాలంటే.. రాహుల్ గాంధీ ఈ యాత్రలో ప్రజలతో మమేకం కావాలి.
Rahul Gandhi : తన అపవాదును తొలగించుకుంటారా?
రాహుల్ గాంధీకి తనపై ఉన్న అపవాదును ఈ యాత్రతో అయినా తొలగించుకుంటారా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజల సమస్యలకు ఆయన ఇక నుంచి దూరంగా కాకుండా దగ్గరగా ఉండి… వచ్చే ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్నారు. ఒక ఫెయిల్యూర్ లీడర్ స్థాయి నుంచి సక్సెస్ ఫుల్ లీడర్ స్థాయికి ఎదగడానికి రాహుల్ గాంధీకి ఉన్న ఒకే ఒక అవకాశం ఇది. ఈ అవకాశాన్ని రాహుల్ సద్వినియోగం చేసుకుంటారా? లేదా అనేది ఆయన మీదే ఆధారపడి ఉంది. ఈ యాత్రను ఏదో మొక్కుబడిగా కాకుండా రాహుల్ ప్రజలతో మమేకమై వాళ్ల గోడు విని.. వాటికి పరిష్కారం చూపే దిశగా ఆయన వెళ్లాలని అప్పుడే కాంగ్రెస్ పార్టీపై దేశ ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. చూద్దాం మరి.. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఈ యాత్ర పూర్వవైభవం తెస్తుందా? లేదా అని.