YS Jagan – Pawan Kalyan : ప్రస్తుతం ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు గురించే చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్ పేరు మీద ఉన్న వైద్య విశ్వవిద్యాలయం పేరును మార్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని చేసిన విషయం తెలిసిందే. దీనిపై నిన్న అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది. ఎన్టీఆర్ పై తమకు ఎప్పుడూ కోపం లేదని.. ప్రేమ, ఆప్యాయతే ఉందని.. అందుకే ఆయన పేరుతో ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేశామని సీఎం జగన్ స్పష్టం చేశారు. అయితే.. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు మార్పుపై చాలామంది అనేక విధాలుగా మాట్లాడుతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.

పేర్లు మార్చాలి అని జగన్ ప్రభుత్వం అనుకుంటోంది కదా.. మరి బ్రిటీషర్ల పేరు మీద ఉన్న వైజాగ్ లోని కింగ్ జార్జ్ ఆసుపత్రి పేరును ఎందుకు మార్చడం లేదు అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ముందు కింగ్ జార్జ్ ఆసుపత్రి పేరును మార్చి ఆ తర్వాత వేరే వాటి పేర్లు మార్చండి అంటూ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. నిజంగా వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్చాలనుకుంటే ప్రపంచంలో ఎంతో ప్రసిద్ధి చెందిన వైద్య శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు పేరును ఎందుకు పెట్టడం లేదు అంటూ పవన్ ప్రశ్నించారు.
YS Jagan – Pawan Kalyan : పేరు మార్చితే వైద్య వసతులు మెరుగవుతాయా?
ఎన్టీఆర్ పేరును మార్చి వేరే పెట్టడం వల్ల.. ఏం సాధిస్తారు. వైఎస్సార్ అని పేరు పెట్టగానే.. వైద్య వసతులు మెరుగవుతాయా? అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో అసలు వైద్య వసతులు ఎలా ఉన్నాయి.. ప్రమాణాలకు తగ్గట్టుగా ఉన్నాయా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రజల దృష్టిని పక్కదోవ పట్టించేందుకే ఈ వివాదాలు సృష్టిస్తున్నారు. పాలకులు మారినప్పుడల్లా పేర్లు మార్చుతూ వెళ్తారా? అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయం పేరు మార్పుపై వైసీపీ పార్టీ తప్పితే మిగతా ఏ పార్టీ కూడా ఒప్పుకోవడం లేదు. ఇప్పటికే పేరు పెట్టిన వాటి పేర్లు మార్చకుండా.. ఏవైనా కొత్తగా నిర్మిస్తే వాటికి వైఎస్సార్ పేరు పెట్టండి కానీ. ఇప్పటికే ఉన్న ఎన్టీఆర్ పేరును మార్చడం ఎందుకు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈనేపథ్యంలో వైఎస్ జగన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారా? లేక ఎన్టీఆర్ పేరును తీసేసి వైఎస్సార్ పేరును పెడతారా అనేది వేచి చూడాల్సిందే.