Andhra Pradesh : ఉమ్మడి ఏపీ విడిపోయి దాదాపు 8 ఏళ్లు కావస్తోంది కానీ.. ఇప్పటి వరకు విభజన సమస్యలను మాత్రం పరిష్కరించలేకపోయారు. ఉమ్మడి ఏపీ కాస్త ఏపీ, తెలంగాణ అంటూ రెండు రాష్ట్రాలుగా విభజించారు. విభజన తర్వాత పలు సమస్యలు వస్తాయని భావించి వాటిని వెంటనే పరిస్కరిస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం.. పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పింది.

కానీ.. ఇప్పటి వరకు పెండింగ్ సమస్యలపై మాత్రం ఎలాంటి ఉలుకూ పలుకూ లేదు. 2014 లో ముఖ్యమంత్రిగా గెలిచిన చంద్రబాబు చాలా సార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో విభజన సమస్యలపై చర్చించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కూడా చాలా సార్లు ఢిల్లీ వెళ్లారు. కానీ.. ఇప్పటి వరకు అడుగు మాత్రం ముందుకు పడలేదు.
Andhra Pradesh : ఏపీ పెండింగ్ సమస్యలపై ఢిల్లీలో కీలక భేటీ
అయితే.. ఏపీకి సంబంధించిన పెండింగ్ అంశాలపై ఢిల్లీలో కీలక సమావేశం జరగబోతోంది. ఏపీకి సంబంధించిన అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కేంద్ర కేబినేట్ సెక్రటేరియేట్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగనుంది. ఏపీకి సంబంధించిన పెండింగ్ అంశాలను కూడా ఇప్పటికే కేబినేట్ సెక్రటేరియేట్ కు ఏపీ ప్రభుత్వం పంపించింది. కేంద్ర, రాష్ట్రాల సమన్వయ కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. గతంలో ఇచ్చిన హామీలు, నెరవేర్చినవి, పెండింగ్ లో ఉన్న అంశాలు అన్నింటిపై ఈ సమీక్షను నిర్వహించనున్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ లాంటి అంశాలపై ఈ సమీక్షలో చర్చించే అవకాశం ఉంది.