YSRCP : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మికంగా మరణించడంతో.. తన నియోజకవర్గమైన ఆత్మకూరులో ఉపఎన్నిక అనివార్యం అయింది. వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గౌతమ్ రెడ్డి మృతితో ఆ స్థానంలో వైసీపీ నుంచి ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డి బరిలో ఉన్నాడు. నిజానికి.. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎవరో కాదు.. మేకపాటి గౌతమ్ రెడ్డికి స్వయానా బాబాయి. అంటే.. ఇప్పుడు ఉపఎన్నికలో బరిలో ఉన్న విక్రమ్ రెడ్డికి కూడా బాబాయి అవుతాడు.

అందువల్ల.. ఆత్మకూరు ఉపఎన్నికను చంద్రశేఖర్ రెడ్డి దగ్గరుండి చూసుకోవాలి కానీ.. ఇప్పటి వరకు ఆత్మకూరు నియోజకవర్గంలో చంద్రశేఖర్ రెడ్డి పర్యటించింది లేదు.. అసలు అడుగే పెట్టలేదు. అసలు.. ఆత్మకూరు ఉపఎన్నికకు ఎందుకు చంద్రశేఖర్ రెడ్డి దూరంగా ఉన్నాడు అనే ప్రశ్న ఇప్పుడు ఆ నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.
YSRCP : మంత్రి పదవి దక్కలేదని అలక బూనాడా?
ఆత్మకూరు ఉపఎన్నికలో గెలిచేది వైసీపీనే. సానుభూతి అంటారో.. ఇంకేదైనా అంటారో కానీ.. అక్కడ వైసీపీ అభ్యర్థి తప్పితే మరే బలమైన అభ్యర్థి లేడు. టీడీపీ, జనసేన పార్టీలు ఆత్మకూరులో అభ్యర్థులనే నిలపలేదు. ఒక బీజేపీ మాత్రం అక్కడ పోటీ చేస్తోంది. చిన్నాచితకా పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కలిపితే ఆత్మకూరులో పోటీ చేసేది 13 మంది అభ్యర్థులు మాత్రమే.
అయినప్పటికీ.. చంద్రశేఖర్ రెడ్డి ఎందుకు ఆత్మకూరులో ప్రచారంలో పాల్గొనడం లేదనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం తర్వాత ఒకవేళ తనకు మంత్రి పదవి దక్కుతుందని చంద్రశేఖర్ రెడ్డి ఆశించారేమో? కానీ.. సీఎం జగన్ ఆయన్ను అంతగా పట్టించుకున్న దాఖలాలు లేవు. రెండో సారి మంత్రివర్గ విస్తరణలో చంద్రశేఖర్ రెడ్డి ఊసే లేదు. జగన్ కూడా ఆయన్ను లైట్ తీసుకున్నారు.
అందుకే.. ఆయన సీఎం జగన్ మీద అలిగారు అనే వార్తలు ఇప్పుడు ఆత్మకూరులో చక్కర్లు కొడుతున్నాయి. ఇదెలా ఉంటే.. మేకపాటి కుటుంబం కూడా ఆత్మకూరులో ఎన్నికల ప్రచారం కోసం చంద్రశేఖర్ రెడ్డిని పిలవలేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే చంద్రశేఖర్ రెడ్డి కూడా ఆత్మకూరు ఉపఎన్నికను లైట్ తీసుకున్నాడా? అసలు ఏం జరిగింది అనే విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.