YCP MLA : వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతున్న తీరు, చేస్తున్న పనులు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయని.. పార్టీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని తెలుస్తోంది. నిజానికి.. ఏ పార్టీలో అయినా రెబల్స్ ఉండటం కామనే. ఒకరో ఇద్దరూ అలాంటోళ్లు ఉంటారు. వైసీపీ నుంచి నరసాపురం ఎంపీగా గెలిచిన కొన్ని రోజులకే పార్టీకి, సీఎం జగన్ కు రఘురామ కృష్ణంరాజు ఎదురు తిరిగారు. జగన్ పై ఎన్నో ఆరోపణలు చేశారు.

ఇప్పుడు ఆయన బాటలోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా నడుస్తున్నారా అన్న అనుమానం నెల్లూరు ప్రజల్లో కలుగుతోంది. ఎందుకంటే.. తన నియోజకవర్గంలో డ్రైనేజీ పనుల కోసం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం కేటాయించలేదంటూ ఏకంగా వెళ్లి డ్రైనేజీలోనే కూర్చొన్నారు ఆయన.
YCP MLA : సొంత పార్టీ అధికారంలో ఉన్నా పనులు కావడం లేదని అసహనం
గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తాను ఎమ్మెల్యేగా ఉన్నా కూడా తనకు నిధులు ఇవ్వలేదని.. ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చినా కూడా అదే పరిస్థితి కొనసాగడంపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర అసహసం వ్యక్తం చేశారు. రోడ్లు, డ్రైనేజీల మౌలిక సదుపాయల కోసం ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వడం లేదని ఈసందర్భంగా ఆయన మీడియాకు తెలిపారు.
చివరకు కార్పొరేషన్ అధికారులు కూడా తన మాట వినడం లేదని ఆయన వాపోయారు. నిజానికి.. పార్టీ తరుపున గెలిచి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా.. ప్రకటనలు చేసినా ఏం జరుగుతుందో రఘురామ విషయంలోనే అందరికీ తెలిసింది. ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇలా సొంత పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండటంతో ఇది పార్టీకి ఎటువంటి ముప్పు తెస్తుందో అని వైసీపీ వర్గాలు టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.
నిజానికి.. నెల్లూరు జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉండటంతో అది తనకే దక్కుతుందని కోటంరెడ్డి భావించారు. కానీ.. మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు బదులు కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది. దీంతో పార్టీ తీరుపై ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారు. మంత్రి పదవి రాలేదని.. ఇలా పార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ వర్గాలు సరిద్దుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.