YS Jagan : ఇంకో రెండేళ్లలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. దానికోసం ఇప్పటి నుంచే అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. ఏ నియోజకవర్గంలో ఏ నేతకు టికెట్ ఇవ్వాలి. సిట్టింగ్ లకు ఇవ్వాలా వద్దా.. ప్రజా బలం ఉన్న నేతలు ఎవరైనా ఉంటే వాళ్లను ఎలా పార్టీలోకి లాక్కోవాలి? లాంటి సమీకరణాలు.. ప్రతి పార్టీలో జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ మాత్రం ఇప్పటికే చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఎన్నికల కోసం ముందు నుంచే అన్నీ సిద్ధం చేసుకుంటోంది. ఒకసారి ప్రజలు జగన్ కు చాన్స్ ఇచ్చారు. మరి.. రెండో సారి కూడా ఇవ్వాలంటే సీఎంగా ఏపీకి అంతో ఇంతో చేసి ఉండాలి. ఏపీ ప్రభుత్వం మాత్రం ఏపీకి ఎంతో చేసిందని.. అందుకే రెండో సారి కూడా వైసీపీకే ప్రజలు అధికారం కట్టబెడతారని చెబుతోంది. అయినప్పటికీ.. ప్రతిపక్ష పార్టీలను మళ్లీ ఓడించేందుకు పక్కాగా వ్యూహాలు రచిస్తున్నారు సీఎం జగన్.

అందులో భాగంగా ఇప్పటికే ప్రజాకర్షణ ఉన్న నేతలను పార్టీలోకి లాక్కునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మరోవైపు 2019 ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేసి రికార్డు స్థాయిలో మెజారిటీని జగన్ సాధించిన విషయం తెలిసిందే. దానికి కారణం.. పులివెందులకు, వైఎస్ కుటుంబానికి ఉన్న అనుబంధం. ఇప్పుడు కాదు.. వైఎస్సార్ రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబానికి చెందిన నేతలే గెలుస్తూ వస్తున్నారు.
YS Jagan : ఈసారి జగన్ పులివెందులలో పోటీ చేయడం లేదా?
అయితే.. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్.. పులివెందుల నుంచి పోటీ చేసే అవకాశాలు లేనట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్ కుటుంబానికి పులివెందులతో ఎంత అనుబంధం ఉందో.. ఆ తర్వాత అంతే అనుబంధం.. జమ్మలమడుగుతో ఉంది. అందుకే.. ఈసారి పులివెందుల కాకుండా.. జమ్మలమడుగుపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ భావిస్తున్నారట. అందుకే.. పులివెందుల నుంచి వేరే వ్యక్తిని పోటీలోకి దింపి.. తాను జమ్మలమడుగులో పోటీ చేయాలని జగన్ భావిస్తున్నట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఈసారి పులివెందుల నుంచి తన బాబాయి కూతురు వైఎస్ సునీతను పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారట. తన బాబాయి సెంటిమెంట్ ను పులివెందులలో వాడుకొని.. జమ్మలమడుగు నుంచి తాను పోటీ చేయాలని భావిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జమ్మలమడుగు నుంచి జగన్ పోటీ చేస్తే గనుక.. పులివెందుల రికార్డును బద్దలు కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. పులివెందులలో వచ్చిన మెజారిటీని క్రాస్ చేసినా చేయొచ్చు. చూద్దాం మరి.. ఏ జరుగుతుందో?